జేఈఈలో 2 మార్కులతో ఫెయిల్.. ఇప్పుడు ఇస్రో సైంటిస్ట్!

  • జేఈఈలో రెండు మార్కులతో విఫలమైనా పట్టు వదలని యువకుడు
  • కోచింగ్ తీసుకోకుండా సొంతంగా చదివి ఐఐఎస్‌టీలో సీటు సాధించిన వైనం
  • ఇస్రో శాస్త్రవేత్తగా ఎంపికై తల్లిదండ్రులకు సర్‌ప్రైజ్ చేసిన సంకేత్ కుమార్ 
  • కుటుంబ సభ్యుల మద్దతే తన విజయ రహస్యమని వెల్ల‌డి
  • పిల్లలను నమ్మితే వారే విజయాలు సాధిస్తారన్న కుటుంబ సభ్యులు
పట్టుదల, కృషి ఉంటే ఎలాంటి వైఫల్యాలనైనా విజయాలుగా మార్చుకోవచ్చని నిరూపించాడు మీరట్‌కు చెందిన యువకుడు సంకేత్ కుమార్. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో కేవలం రెండు మార్కుల తేడాతో విఫలమైనా కుంగిపోకుండా, అదే పట్టుదలతో చదివి ఇప్పుడు ఏకంగా భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో)లో సైంటిస్ట్/ఇంజినీర్‌గా ఉద్యోగం సాధించి యువతకు స్ఫూర్తిగా నిలిచాడు.

ఉత్తరప్రదేశ్‌లోని మీరట్, మోదీపురం వాసి అయిన సంకేత్ కుమార్, 2021లో దీవాన్ పబ్లిక్ స్కూల్‌లో 12వ తరగతి పూర్తి చేశాడు. అదే ఏడాది జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షలో కేవలం రెండు మార్కులతో అర్హత సాధించలేకపోయాడు. చాలా మంది ఒక ఏడాది వృథా చేసుకోవద్దని సలహా ఇచ్చినా, సంకేత్ మాత్రం తన కలను సాకారం చేసుకోవడానికే మొగ్గు చూపాడు. ఎలాంటి కోచింగ్ సెంటర్‌లో చేరకుండా కేవలం యూట్యూబ్ వీడియోలు, పాత ప్రశ్నపత్రాల సహాయంతో సొంతంగా చదువుకున్నాడు.

ఆ తర్వాతి ఏడాదే జేఈఈ మెయిన్, అడ్వాన్స్‌డ్ రెండింటిలోనూ విజయం సాధించి, తిరువనంతపురంలోని ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ స్పేస్ సైన్స్ అండ్ టెక్నాలజీ (ఐఐఎస్‌టీ)లో ఏరోస్పేస్ ఇంజినీరింగ్ విభాగంలో సీటు సంపాదించాడు. అక్కడ కూడా తోటి విద్యార్థులంతా ప్రాపల్షన్, ఏరోడైనమిక్స్ వంటి ప్రాచుర్యం పొందిన సబ్జెక్టులను ఎంచుకుంటే, సంకేత్ మాత్రం వినూత్నంగా 'వైబ్రేషన్స్ అండ్ అకౌస్టిక్స్' అనే సబ్జెక్టును ఎంచుకున్నాడు. తన బ్యాచ్‌లో ఆ సబ్జెక్టును తీసుకున్న ఏకైక విద్యార్థి అతడే కావడం విశేషం. కోర్సు సమయంలో జపాన్‌కు చెందిన షిన్‌రా ఇంక్. సంస్థ నిర్వహించిన ఒక అడ్వాన్స్‌డ్ ఇంజినీరింగ్ రీసెర్చ్ ప్రాజెక్ట్‌కు కూడా ఎంపికై మూడు నెలల పాటు పనిచేశాడు.

ఐఐఎస్‌టీలో 8.2 సీజీపీఏతో ఉత్తీర్ణత సాధించిన తర్వాత అతనికి ఇస్రో నుంచి ఇంటర్వ్యూకు పిలుపు వచ్చింది. ఇంటర్వ్యూలోనూ విజయం సాధించి, ఇస్రో సైంటిస్ట్‌గా ఎంపికయ్యాడు. రాకెట్ వ్యవస్థల తుది పరీక్షలు నిర్వహించే మహేంద్రగిరిలోని ఇస్రో ప్రాపల్షన్ కాంప్లెక్స్‌లో అతని మొదటి పోస్టింగ్ ఉండనుంది.

తన విజయంపై సంకేత్ మాట్లాడుతూ.. "నా విజయానికి పూర్తి కారణం నా కుటుంబమే. నేను డ్రాప్ తీసుకున్నప్పుడు చాలామంది చాలా రకాలుగా మాట్లాడారు. కానీ, నా కుటుంబం నాకు అండగా నిలిచింది. ముఖ్యంగా మా అన్నయ్య ఆర్థికంగా ఎంతో మద్దతు ఇచ్చాడు. ఇస్రో ఇంటర్వ్యూకి వెళ్తున్నట్లు కూడా నేను ఇంట్లో చెప్పలేదు. ఎంపికయ్యాక వారికి సర్‌ప్రైజ్ ఇవ్వాలనుకున్నాను" అని తెలిపాడు.

సంకేత్ విజయం పట్ల అతని తల్లిదండ్రులు సునీతా సింగ్, గుల్షన్ కుమార్, సోదరుడు హర్షిత్ కుమార్ ఆనందం వ్యక్తం చేశారు. "మా కల నెరవేరినందుకు చాలా సంతోషంగా ఉంది. తల్లిదండ్రులు తమ పిల్లలను నమ్మి, వారికి మద్దతుగా నిలవాలి. అప్పుడు వారే తమ విజయగాథలను స్వయంగా రాసుకుంటారు" అని వారు అన్నారు. సంకేత్ మాజీ ప్రిన్సిపాల్ అసీమ్ దూబే మాట్లాడుతూ, సంకేత్ క్రమశిక్షణ, పట్టుదల కలిగిన విద్యార్థి అని, అతని విజయం తనకు గర్వకారణమని పేర్కొన్నారు.

Sanket Kumar
ISRO Scientist
JEE Advanced Success Story
IIST Thiruvananthapuram
Meerut ISRO Engineer
Aerospace Engineering Career

More Telugu News